పోలీసుశాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి మళ్లీ తీసుకెళ్తానన్న పవన్ కల్యాణ్.. ఘటనాస్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలన్నారు. పోలీసులకు ఇంకా క్రౌడ్ మేనేజ్‌మెంట్ రావట్లేదన్న పవన్ కల్యాణ్.. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగిందని నిలదీశారు.
తొక్కిసలాట జరిగితే సహాయ చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక లేదని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు.
తొక్కిసలాట ఘటనపై దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్న పవన్ కల్యాణ్.. జరిగిన తప్పునకు బాధ్యత తీసుకుంటున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలన్న పవన్..
మృతుల కుటుంబాలకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని సూచించారు. అధికారుల తప్పులకు మేం తిట్లు తింటున్నామని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
తప్పు జరిగింది.. క్షమించమని బాధితులను అడిగా.. వీఐపీలపై కాదు.. సామాన్యులపై టీటీడీ దృష్టిపెట్టాలి.. దర్శనం కోసం 8-9 గంటలు ఎదురుచూసే పరిస్థితి మారాలి.. సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలి.. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి.. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ పోలీసులు శాఖను ఇలా టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఏదో వ్యూహంతోనే ఆయన ఇలా చేస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.