పై స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో సారవంతమైన భూములు, విస్తారమైన రవాణా మార్గాలు ఉన్నాయి. అన్నింటికీ మించి దేశంలోనే ముంబై తర్వాత అత్యంత వాణిజ్య నగరమైన హైదరాబాద్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
వేలకోట్ల ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాయి. అదే స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి డ్రై పోర్ట్ కనుక ఉంటే తిరుగు ఉండదు. ఇప్పుడు ఈ ప్లాన్ ను అమల్లో పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. “తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణకు తీర ప్రాంతం అనేది లేదు. అందువల్లే డ్రైపోర్టు నిర్మించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు మొదలుపెట్టారు.
దీనికోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారిని, రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించారు.. హైదరాబాదు నగరంలో ఫోర్త్ సిటీ నిర్మించనున్నారు. దీనిని ఫ్యూచర్ సిటీగా తీర్చి దిద్దనున్నారు. లండన్, దుబాయ్, టోక్యో, న్యూయార్క్, సీయోల్ మాదిరిగా అభివృద్ధి చేస్తారు. ఇందులో కాలుష్యానికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వరు.. ‘నెట్ జీరో సిటీ”గా రూపొందిస్తారు. ఇక 360 కిలోమీటర్ల పొడవు కలిగిన రీజినల్ రింగ్ రోడ్డు ను కూడా నిర్మిస్తున్నారు. ఓ ఆర్ ఆర్, ఆర్ ఆర్ ఆర్ ను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి.. బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాలను తయారు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు.
ఇక మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రణాళికల రూపొందించింది. 55 కిలోమీటర్ల మేర స్వచ్ఛమైన నీటితో ప్రవహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 2050 వరకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇవేకాక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. వీటి ద్వారా కాలుష్యాన్ని తగ్గించి.. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రస్తుత కాలుష్య పరిశ్రమలను నగరానికి దూరంగా ఏర్పాటుచేసి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నది. భవిష్యత్తు కాలంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు మొత్తం కాలుష్య రహితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.