మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు.
రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.