తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ఎత్తులు.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వ్యూహాల ముందు చిత్తవుతున్నాయి.  బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు.  ఇప్పుడు అధికారంలోకి వచ్చారు.  సీఎంగా ఉన్నారు.  కానీ, గత పాలకులు చేసిన ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోతున్నారు.  


కాళేశ్వరం, విద్యుత్‌కొనుగోళ్ల ఒప్పందాలపై వేసిన కమీషన్ల విచారణ కొనసాగుతోంది.  ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఫార్ములా ఈ కార్‌ రేసులో అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు కేటాయించడం వ్యవహారంలో కేసు నమోదు.. ధరణిలో అక్రమాలు, గొర్రెల పంపిణీ పథకం, మిషన్‌ భగీరథలో అక్రమాలు ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్క అవినీతిని కూడా రేవంత్‌ సర్కార్‌ నిరూపించలేకపోయింది.


కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ఆయన క్యాబినెట్‌లోని 10 మందిని ముప్పు తిప్పలు పెడుతున్నారు.  బీఆర్‌ఎస్‌ విమర్శలు, ఆరోపణలను మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతల దూకుడు కొనసాగుతోంది. కేటీఆర్, హరీశ్‌రావులకు తోడు.. ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పాడి కౌషిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌ తోడవడంతో అధికార పార్టీపై విమర్శల దాడి కొనసాగుతోంది.


అప్పుడప్పుడు అధికార పార్టీ కేసులు పెడుతున్నా.. అరెస్టులు చేస్తున్నా.. అవన్నీ మొక్కుబడిగానే మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలను కంట్రోల్‌ చేయలేకపోతున్నాయి. లగచర్ల కేసులో పట్నం మహేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన 20 రోజులకే బెయిల్‌ వచ్చింది. ఇక పాడి కౌషిక్‌రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు పెట్టారు. అరెస్టు చేసిన ఒకటి రెండు రోజులకు మించి జైల్లో పెట్టలేకపోతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై అధికారిక కార్యక్రమంలో కొట్టేంత పని చేసినా.. అధికార పార్టీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. మూడు కేసులు పెట్టి అరెస్టు చేసినా.. వెంటనే బెయిల్‌ వచ్చేసింది.


కౌషిక్‌రెడ్డిని ఈసారి ఎలాగైనా జైల్లో పెట్టాలని రేవంత్‌ సర్కార్‌ ప్లాన్‌ చేసింది.  మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల ఎదుటే పాడి కౌషిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను కొట్టినంత పనిచేశాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.  సెలవు రోజు చూసి అరెస్టు చేసినా.. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉంచలేకపోయారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: