తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయింది.  18 మంత్రి పదవులకు గాను, ప్రస్తుతం 12 పదవులే భర్తీ అయ్యాయి. కీలకమైన హోం, విద్య శాఖలు సీఎం వద్దే ఉన్నాయి.  ఏడాది పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సర్వే చేయించారు.  ఈ సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు గుర్తించారు.  ఈ నివేదికను సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.  దీని ప్రకారం రాష్ట్ర క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం రేంత్‌రెడ్డికి అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.   



కేబినెట్‌ నుంచి తప్పించాలనుకుంటున్న ముగ్గురు మంత్రులకు ఇప్పటి వరకు తమ శాఖలపై పట్టు సాధించలేదని తెలుస్తోంది.  ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనసవర వివాదాలకు కారణం అవుతున్నారట.  వేటు పడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నట్లు తెలిసింది.  ఈ ముగ్గురిని తొలగించడం వలన పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. కేడర్‌ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్‌ సర్వే నిర్వహించినట్లు తెలిసింది.  


కొండా సురేఖ వ్యవహారశైలి దురుసుగానే ఉంది.  ఇక విపక్ష నేతలపై ఆమె చేస్తున్న విమర్శలు, సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన విమర్శలు, కేటీఆర్‌పై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కూడా కొండా సురేఖ అతిజోక్యం కారణంగా ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.


జూపల్లి కృష్ణారావుకి సీనియర్‌ ఎమ్మెల్యే హోదాలో మంత్రిపదవి దక్కింది.  కానీ, ఆయన ఆశించిన మేరకు పని చేయడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేకపోతున్నారట. ఇటీవల యూబీ గ్రూప్‌ తెలంగాణ నుంచి కింగ్‌ ఫిషర్‌ బీర్లను ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్‌ చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారట.


ఖమ్మం జిల్లా నుంచి సీనియర్‌ నేత హోదాలో మంత్రి పదవి దక్కించుకున్న మరో నేత తుమ్మల నాగేశ్వర్‌రావుకి అనుభవం చాలా ఉంది. కానీ, ప్రస్తుతం తన శాఖపై పట్టు సాధించలేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి పదవులు రావడం కూడా ఆయనను తప్పించడానికి కారణంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: