విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏలినాటి శని వదిలేసినట్లుగా సీన్ చూస్తే అర్ధం అవుతోంది.  విశాఖ ప్లాంట్ త్యాగాల పునాదుల మీద ఏర్పాటు అయిది.  ఈ ప్లాంట్ కావాలని కోరుతూ 32 మంది తమ ప్రాణాలను పోరాటంలో పెట్టి అమరులు అయ్యారు.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాడు ఉమ్మడి ఏపీ అంతా గర్జించింది.  ఉక్కు మహిళ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్ కి పునాది రాయి వేశారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే చాలు తమ జీవితాలు బాగుపడతాయని ఉత్తరాంధ్ర బంగారం అవుతుందని భావించి స్వచ్చందంగా తమ భూములను వేలాదిగా ఇచ్చారు ఆనాటి విశాఖ ప్రజలు. అలా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడమే కాదు ఉత్పత్తిలోనూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. విశాఖ ఉక్కులో తయారు అయ్యే స్టీల్ కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది.


ఈ రోజు ఆర్ధిక రాజధానిగా ఉంది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు కావడం వల్లనే అన్నది కూడా అందరికీ తెలుసు. విశాఖ మినీ ఇండియాగా మారినా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది విశాఖకు ఉపాధి కోసం ఇతర వ్యాపారాల కోసం వచ్చినా ఆ ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్ దే అవుతుంది. దీని తర్వాత మరిన్ని అనుబంధ సంస్థలు కూడా వచ్చి ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి.   


ఆంధ్రుల సెంటిమెంట్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నం జరిగింది. దానికి ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించింది. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కొత్త జీవితమే ప్రసాదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి చీకటి రోజులు ముగిసాయని కేంద్ర పెద్దలు అంటున్నారు. స్వయంగా ఉక్కు శాఖ మంత్రి అయిన కుమార స్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కులో ఇక ప్రైవేటీకరణ అన్న మాటే ఉండదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి తీసుకుని రావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ ఆర్ధిక ప్యాకేజీ ఆరంభం మాత్రమేనని మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఇస్తామని ఆయన భారీ హామీ ఇచ్చారు. అంతే కాదు రానున్న రెండు మూడేళ్ళలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని దేశంలోనే నంబర్ వన్ గా చేస్తామని కుమార స్వామి ప్రకటించడం విశేషం. మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది అన్నది అర్ధం అయింది. దాంతో ఆంధ్రుల సెంటిమెంట్ గెలిచింది అని అంతా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: