నారా లోకేష్ కి ప్రమోషన్ వస్తుందా అది కూడా కేవలం నెల రోజులలో జరుగుతుందా అంటే సాగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే అలాగే ఉంది అంటున్నారు.  నిజానికి నారా లోకేష్ ఈ రోజుకు టీడీపీలో నంబర్ టూ గా ఉన్నారు. జనసేన, బీజేపీ మంత్రులు మినహా మిగిలిన 19 మంది మంత్రులు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా లోకేష్ కి చంద్రబాబు తో సరిసమానంగా గౌరవం ఇస్తున్నారు.  


తమిళనాడులో తొలిసారి మంత్రి అయిన ఉదయనిధికి మూడేళ్ళ వ్యవధిలోనే డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇచ్చారు.  అలాంటిది లోకేష్ కి ఏమి తక్కువ అన్నది టీడీపీ తమ్ముళ్లలో వస్తున్న డిమాండ్ గా ఉంది. ఒక విధంగా నారా కుటుంబం కోరికమేరకు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ప్రమోషన్ గా దక్కనుంది అని అంటున్నారు.


ఈ నెలాఖరు నుంచి మాఘమాసం వస్తుంది. ఆ మీదట అన్నీ మంచి రోజులే. దాంతో ఫిబ్రవరి నెలలో ఒక మంచి ముహూర్తం చూసుకుని నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు.  ఇదే విషయం టీడీపీలో అతి పెద్ద చర్చగా సాగుతోంది.  ఒక విధంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవడం ఖాయమని కూడా ప్రచారం హోరెత్తుతోంది.


కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి వేళ అక్కడకి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి ఇదే విషయం మీద బాబుకు రిక్వెస్ట్ చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయమని ఆయన కోరడం తో తమ్ముళు అంతా మద్దతు పలికారు. ఇది తమ్ముళ్ల మనసులో ఏముందో అసలు టీడీపీ మదిలో ఏముందో కూడా తెలియచేసే ఉదంతంగా చూస్తున్నారు.  


లోకేష్ కూడా గతంతో పోలిస్తే బాగా రాణిస్తున్నారు.  ఇదే కరెక్ట్ సమయం అని ఆయనను ముందుగా డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేస్తే ఆ తరువాత సీఎం పదవికి ఆయన ఏ విధమైన ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా చేరుకుంటారు అని అంటున్నారు.  మొత్తానికి మాఘ మాసంలో మంచి ముహూర్తంలో లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: