రేవంత్ సర్కారు ఫోకస్ మొత్తం హైదరాబాద్ మహానగరం మీదనే ఉంది.  మహానగర రూపురేఖలు ఎంతలా మారిస్తే.. అంత రాబడితో పాటు.. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు సైతం తగ్గే వీలుంది. అధికారం చేతిలోకి వచ్చిన వేళ.. ఎడాపెడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కాస్త కష్టంగా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిరుత్సాహాన్ని కలిగించేలా మారాయి.  కాస్త ఆలస్యంగా గుర్తించిన రేవంత్ సర్కారు.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది.


అవసరానికి మించిన యాక్షన్ ప్రదర్శించిన హైడ్రాకు ముకుతాడు వేయటం..  అదే సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలుగని రీతిలో దాన్ని నడిచేలా చేయటంతో పాటు.. మూసీ మీద జోరు తగ్గించి.. మూలన పడి ఉన్న మెట్రో ప్రాజెక్టుల ఫైళ్ల దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే.   ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఇమేజ్ పెంచటంతో పాటు.. పడిన రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపు.. ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరుకు మెట్రోను భారీగా విస్తరించాలన్న ఆలోచన చేయటం తెలిసిందే.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. డెవలప్ మెంట్ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారుతో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తూ.. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల్ని కేంద్రం మోకాలడ్డకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగా మెట్రో ప్రాజెక్టుల అనుమతులను కేంద్రం త్వరగా ఇప్పించేలా వ్యవహరిస్తున్నారు.


తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.  హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సాయం చేస్తుందని.. అది తమ బాధ్యతగా పేర్కొన్నారు. రాజకీయంగా రేవంత్ సర్కారు మీద విమర్శలు సంధిస్తూనే.. తెలంగాణ రాష్ట్ర డెవలప్ మెంట్ కు అవసరమైన మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన సాయం కేంద్రం నుంచి తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. కిషన్ రెడ్డి చెప్పిన మాట మీదే కేంద్రం కాని నిలిస్తే.. నాలుగేళ్ల వ్యవధిలో హైదరాబాద్ మహానగరంలో దాదాపు 150 కి.మీ. పైగా కొత్త మెట్రో రైలు మార్గం వచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ లో సహకారం అందిస్తామన్న కిషన్ రెడ్డి మాటలు నిజమైతే.. హైదరాబాద్ కు అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: