ఏటా దావోస్లో  అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతుంటుంది.  ప్రపంచ దేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతారు.  లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సులో నిర్ణయాలు జరుగుతుంటాయి.  అందుకే అన్ని దేశాలు ఈ సదస్సును సద్వినియోగం చేసుకుంటాయి.  


గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాలు ఈ సదస్సును చాలా తేలికగా తీసుకున్నాయి. ఏపీలో వైసీపీ సర్కార్, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం పెద్దగా ఈ సదస్సుకు హాజరైన సందర్భాలు లేవు.  ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ..  ప్రత్యేక బృందాలతో ఈ సదస్సుకు హాజరవుతున్నాయి.


ఏపీ సీఎం చంద్రబాబుకు దావోస్ సదస్సు ఎంతో ప్రత్యేకమైనది.  ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు.   ఈ సదస్సులో పెట్టుబడులు ఆకర్షించే ధ్యేయంగా అడుగులు వేస్తుంటారు.  ఒక హైప్ క్రియేట్ చేసేందుకు డబ్బుల ఖర్చుకు వెనకడుగు వేయరు.  ఇప్పటికే అంతర్జాతీయంగా చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సైతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సీనియార్టీ కి తగిన గుర్తింపు కచ్చితంగా ఈ సదస్సులో ఉంటుంది. చంద్రబాబు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.


మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ సదస్సుకు వెళ్లడం ఇది రెండోసారి.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సదస్సు ప్రారంభం కావడంతో.. ఎటువంటి సన్నాహాలు లేకుండా తొలి సదస్సుకు హాజరయ్యారు.  ఈసారి మాత్రం పూర్తి ప్రిపరేషన్ తో వెళ్తున్నారు.  తన టీం ముద్ర స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్‌ హయాంలో అయినా.. ఇప్పుడు రేవంత్ హయాంలోనైనా.. పెట్టుబడుల వ్యవహారాలను చూసేది, కంపెనీలతో టచ్ లో ఉండేది ఐఏఎస్ అధికారి జియేష్ రంజనే..  ఈసారి కూడా ఆయనే అన్నీ చక్కబెడుతున్నారు. దావోస్ సదస్సులో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్ తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నడుస్తోంది.  ముఖ్యంగా పరస్పర చక్కటి సహకారం అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కూడా. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి ఉంది. దానిని నిలబెట్టుకుంటూనే కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు రేవంత్ ప్రయత్నిస్తారు. అదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులను భారీగా ఆకర్షించడం అనేది చంద్రబాబు ముందు ఉన్న కర్తవ్యం. అందుకే దావోస్ పర్యటన అనేది రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: