వైసీపీ సమూల ప్రక్షాళనకు జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన ఉండనున్న నేపథ్యంలో కీలక నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కుటుంబానికి విశాఖ జిల్లాలో చాన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.  విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి బరిలోకి దించారు.  ఆమె ఓడిపోయారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కు అవకాశం కల్పించారు జగన్.  దీంతో విశాఖ వైసీపీ నేతలు నిరాశకు గురయ్యారు.  



ఇప్పుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనును నియమించారు.  దీంతో వైసీపీ నేతలు మరింత ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవల వైసీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు  పార్టీకి గుడ్ బై చెప్పారు.  దీంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అలెర్ట్ అయ్యారు.  భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఆశించారు.  కానీ అనూహ్యంగా చిన్న శ్రీనుకు ఇక్కడ అవకాశం ఇచ్చారు.  గుడివాడకు చోడవరం బాధ్యతలు అప్పగించారు.  


గుడివాడ అమర్నాథ్ కు శాశ్వత నియోజకవర్గం లేకుండా పోయింది.  2024లో ఆయన గాజువాక నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  2019లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.  ఇప్పుడు అవంతి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ ప్లేస్ లోకి వెళ్లాలని భావించారు అమర్నాథ్.  కానీ జగన్ షాక్ ఇచ్చారు.  భీమిలి బాధ్యతలను బొత్స కుటుంబానికి అప్పగించారు.


ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు.  గాజువాక సమన్వయకర్తగా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డిని, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీమంత్రి బూడి ముత్యాల నాయుడును, ఈ గన్నవరం కోఆర్డినేటర్ గా గన్నవరపు శ్రీనివాసరావును నియమించారు.  కరణం ధర్మశ్రీ చాలా రోజులుగా చోడవరం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనను తొలగించి గుడివాడ అమర్నాథ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం ధర్మశ్రీ తో పాటు అమర్నాథ్ కు మింగుడు పడటం లేదు.  మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు కరణం ధర్మశ్రీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.  మొత్తానికైతే విశాఖలో బొత్స కుటుంబ హవా నడుస్తోందని వైసీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.  ముఖ్యంగా విశాఖ వైసిపి నేతలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా జగన్ పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: