విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని గతంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రత్యేక ప్రకటన చేసింది. ఇప్పుడు అనూహ్యంగా అదే స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల రూపాయల భారీ సాయం ప్రకటించడంతో ఇక ప్రైవేటీకరణ ఉండదని సంకేతాలు ఇచ్చింది కేంద్రం. ఈ భారీగా నిధుల కేటాయింపు వెనుక ఒక టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్రానికి హామీ దక్కడం తర్వాతే ప్యాకేజీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల రూపాయల సాయానికి సంబంధించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన చేశారు. 10300 కోట్లు పెట్టుబడిగా.. మిగిలిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ రుణంలో ప్రాధాన్యత వాటా మూలధనం గా మార్చుతామని ప్రకటించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అప్పు 35 వేల కోట్లు గా ఉందని.. బ్యాంకు రుణాలతో పాటు వడ్డీ, ముడి సరుకు సరఫరాకు సంబంధించి చెల్లింపులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాంకర్లతో కేంద్ర ప్రభుత్వం సమీక్షించి. సాయం చేయాలని కోరగా వారు అంగీకరించలేదు. అందుకే ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చించింది. ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బిఐ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది.
స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 92.3% ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యమని సమాచారం. రెండేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందించినట్లు మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ఆగస్టు నాటికి ఆ సామర్థ్యాన్ని నిలబెట్టాలన్నమాట. అయితే దీనిపై కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్థిక ప్యాకేజీ తో స్టీల్ ప్లాంట్ మనుగడ అసాధ్యమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయింపు అనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తెలుస్తోంది. సెయిల్ లో విలీనం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. శాశ్వత పరిష్కారాల కోసం కార్మికుల పోరాటం జరుగుతోందని.. ప్యాకేజీ కోసం కాదని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఆర్థిక ప్యాకేజీతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని భావించడం భావ్యం కాదని.. ఆగస్టు నాటికి ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగానే ప్లాంట్ భవిష్యత్తు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.