సహజంగా నారా లోకేష్ గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర.. వైసీపీ ప్రభుత్వంపై చేసిన పోరాటం.. పార్టీ పరంగా నెంబర్ 2 నాయకుడు ఆయనే కావడం వంటి కారణాలతో.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. అయితే కూటమిలో జనసేనకు ఉన్న ప్రాధాన్యంతో పాటు.. చంద్రబాబు ఒకే ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఈ క్రమంలోని లోకేష్ కు కీలకమైన ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కేటాయించారు. దీంతో అప్పటివరకు తమ నాయకుడికి కీలకమైన పోస్టు కోరుకున్న పార్టీ నేతలకు ఊరట లభించింది.
అయితే వారం రోజులుగా ఏపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అనే చర్చ పై ప్రధానంగా లోకేష్ పేరు తెరమీదకు వస్తోంది. అటు పార్టీని.. ఇటు సర్కార్‌ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే చంద్రబాబు తర్వాత ఆ తరహాలో ఆయన ఎదగడంతో పాటు.. పార్టీని బలోపేతం చేస్తారన్న డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఏది ఏమైనా ఎప్పటికీ ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదికో.. రెండేళ్లకో అయినా లోకేష్‌ను కచ్చితంగా ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అంటున్నారు.