ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా అత్యుత్సాహానికి పోతున్న తమ్ముళ్ల తీరుకు తగ్గట్లే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫ్యూచర్ సీఎం లోకేశ్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి టీజీ భరత్ పై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశం అనంతరం భరత్ ను చంద్రబాబు మందలించారు.
మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని.. ఎప్పుడు.. ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికిన చంద్రబాబు.. ''ఇక్కడకు మనం ఎందుకు వచ్చాం? మీరేం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించటానికి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి కాదుగా?'' అంటూ సీరియస్ అయ్యారు.
మున్ముందూ ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా చెప్పారు. అంతకుముందు భరత్ మాట్లాడుతూ 'ఎవరికి నచ్చినా, నచ్చక పోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేశ్' అని వ్యాఖ్యానించారు. టీజీ భరత్ మాట్లాడుతూ.. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా.. కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యనే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ను తెలుగు తమ్ముళ్లు తీసుకురావటం.. దీనిపై ఎవరూ మాట్లాడొద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన రోజు తర్వాత.. మంత్రి టీజీ భరత్ నోటి నుంచి లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్య రావటం సంచలనంగా మారింది.
దీనికి చెక్ చెప్పేలా.. టీజీ భరత్ పై సీరియస్ అయిన చంద్రబాబు.. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దంటూ గట్టిగా చెప్పారు. మరి.. చంద్రబాబు క్లాస్ మిగిలిన తమ్ముళ్లు అర్థం చేసుకుంటారా? లేదంటే.. టీజీ భరత్ మాదిరి తమ స్వామిభక్తిని ప్రదర్శించుకొని తిట్లు తింటారా?అన్నది చూడాలి.