తెలుగుదేశం పార్టీలో  లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న స్లోగన్ బలంగా వినిపించింది.  భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అయితే.. డిప్యూటీ సీఎం కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి లోకేష్ అర్హుడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.  అది కూడా సీఎం చంద్రబాబు ఎదుట అలా అనడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.  మరోవైపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇకముందు ఇలాంటి ప్రకటనలు వద్దు అంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చే దాకా పరిస్థితి వచ్చింది.


తొలుత మహాసేన రాజేష్ ఈ తేనె తుట్టను కదిపారు. రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి, బుద్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం వర్మ తదితరులు లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.  చివరకు అనంతపురంలో సీఎం చంద్రబాబు ఎదుటే సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు సైతం డిమాండ్ చేయడం విశేషం. అయితే ఉన్నట్టుండి టిడిపి హై కమాండ్ దీనిపై స్పందించి ప్రచారానికి బ్రేక్ చేసింది.  


రాష్ట్రంలో మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళుతున్నాయి.  కూటమి దశాబ్ద కాలం పాటు కొనసాగాలని భావిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ కు ఏకైక డిప్యూటీ సీఎం హోదా ఇస్తేనే గౌరవం అని అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకమునుపే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెరపైకి రావడం విశేషం.  


ఒక వ్యూహం ప్రకారం నేతలంతా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరడం మాత్రం.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరిగాయి. సాధారణంగా టిడిపి అనుకూల మీడియా స్ట్రాటజీ ఒకలా ఉంటుంది.  ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన కూడా అనుకూల మీడియా నుంచి వచ్చింది.  సానుకూలత వస్తే ఒకలా.. లేకుంటే మరోలా వెళ్లడం టిడిపి స్ట్రాటజీ కూడా. 


పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాతే ఆ పదవికి ఎంతో కొంత గౌరవం పెరిగింది. చంద్రబాబు తర్వాత అంతటి ఇమేజ్ పొందగలుగుతున్నారు.  అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్.. తిరుపతి నేత కిరణ్ రాయల్ తో కౌంటర్ ఇప్పించినట్లు ప్రచారం నడుస్తోంది.  లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టిడిపి నేతలు ఎలా కోరుకుంటున్నారో.. అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.  కిరణ్ రాయల్ ప్రకటన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ.. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రకటనలను మానుకోవాలని సూచించడం విశేషం. ఈ విషయంలో టిడిపి ఎలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు ప్రచారం నడుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: