తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల సదస్సుకు సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వెళ్లకుండా తన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును పంపించేవారు. నాడు కుదుర్చుకున్న ఎంవోయూలను ఆ పార్టీ సొంత మీడియా గట్టిగా ప్రచారం చేసేది. తెలంగాణ అమెరికా రేంజ్ లో ఎదిగిపోతోందని డబ్బా కొట్టేది.


అప్పట్లో కేటీఆర్ దావోస్ వెళ్ళినప్పుడు ఒకసారి చంద్రబాబు తారసపడ్డారు.  ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకొని మాట్లాడుకున్నారు.  నాడు దానిని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టలేదు.  ఇద్దరు తెలుగు వాళ్లు ప్రపంచ వేదికపై కలుసుకుని మాట్లాడడాన్ని గర్వంగా చూశారు.  అంతేతప్ప మళ్లీ ఏవో పన్నాగాలు పన్నుతున్నారని, కుయుక్తులు చేస్తున్నారని ఆరోపించలేదు.  నాడు వీరిద్దరూ కలిసి పనిచేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టి.. ఆ సమయంలో ఎటువంటి ఆరోపణలు చేయలేదు.


అయితే ఇప్పుడు సీఎంలు రేవంత్ రెడ్డి , నారా చంద్రబాబు నాయుడు  దావోస్ లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు.  వారిద్దరు కలిసి ఒక ఫోటో దిగారు.  ఈ ఫోటో లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు.  నిన్న ఈ ఈ ఫోటో బయటకు రావడమే ఆలస్యం ఓ సెక్షన్ మీడియా అడ్డగోలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.  గురు శిష్యులు కలిసిపోయారని.. రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కలుపుతారని.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని.. అందుకు నిదర్శనమే ఈ ఫోటో అని.. తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరచడానికి జరుగుతున్న కుట్ర అని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.


ఇక సోషల్ మీడియా గ్రూపుల్లో జరిగిన చర్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇక్కడే ఆ మీడియా అసలు విషయాలు మర్చిపోతోంది.. విడిపోయిన తెలుగు రాష్ట్రాలను కలపడం ఎలా సాధ్యం? తెలంగాణలో పెట్టుబడి పెడితే ఎలాంటి కంపెనీలనైనా స్వాగతిస్తామని గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వ్యాఖ్యానించింది.  జగన్ తన్ని తరిమేస్తే తెలంగాణకు వచ్చిన అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ ఇచ్చింది. ఆ లెక్కన చూస్తే అమర్ రాజా కంపెనీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిదే కదా.


అలాంటప్పుడు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తప్పే కదా. గురిగింజ తన కింద నలుపు ఎరుగదన్నట్టు… ఓ వర్గం మీడియా అడ్డగోలుగా చేస్తున్న ప్రచారం తిరిగి వారికే అడ్డం తిరుగుతోంది. లొసుగులు ఉంటే కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు.  గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లారు.  పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు.  నాడు ఆ సమావేశంలో చంద్రబాబును ఒకసారి, జగన్మోహన్ రెడ్డిని మరోసారి కలిశారు. అంతమాత్రాన ఇక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేక కోణంలో చూడలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: