గత అయిదేళ్ల పాటు ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. కేసీఆర్ జగన్ ఇద్దరూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరూ ఎపుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. అటువంటి ఈ ఇద్దరూ ఒకేసారి ఆరు నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ టీడీపీ మూలాలే. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మీద గురు భావం ఉంది. ఈ క్రమలో అక్కడా ఇక్కడా విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాస్లిందే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే కేసీఆర్ జగన్ కలవవచ్చు అని అంటున్నారు. అది జరుగుతుంది అని రెండు పార్టీల వైపు నుంచి వినిపిస్తున్న మాట.
ఈ ఇద్దరూ మాజీ సీఎంలు అయ్యారు. మరి కలసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలి ఏ రకంగా అధికారంలోకి రావాలి అన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారు అని అంటున్నారు. విపక్షంలో ఉన్నారు, కాబట్టి ఉమ్మడిగా కలసి వెళ్తే మరింతగా రాజకీయం రాటు తేలుతుందని కలసి ఏదైనా సాధించవచ్చు అన్న ఆలోచనలతో సాగుతున్నారని అంటున్నారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీయే కూటమి ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకూ ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయన్నది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా ఈ రెండు పార్టీలు కలసి కూర్చుని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది.
ఈ రెండు పార్టీలకు పార్లమెంట్ లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలసికట్టుగా ఉంటే ఏ కూటమి అయినా వీరి వైపు చూసే చాన్స్ ఉంది అని అంటున్నారు. వ్యూహాలు వేయడంతో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ ది అందె వేసిన చేయి. మరి ఈ ఇద్దరూ కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.