అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో ఒకటైన భారతీయ - అమెరికన్ కమ్యునిటీకి ట్రంప్ మార్కు షాక్ ఇప్పటికే తగిలింది.  సుమారు 4.8 మిలియన్లకు పైగా భారతీయ - అమెరికన్లు నివసిస్తున్నారు.  ఈ సమయంలో.. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఫలితంగా.. హెచ్-1బీ వీసా వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలు లేదా గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలు ఇకపై యూఎస్ పౌరసత్వాన్ని పొందలేరు!


ఇది భారతీయ పౌరులకు అనే కాదు.. అమెరికాలో ఉన్న ఇతర దేశాలకు చెందిన పౌరులందరికీ వర్తిస్తుంది.  ఇది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ, ఈ రోజో రేపో గ్రీన్ కార్డు రాకపోతుందా, తమ పిల్లలు అక్కడే సెటిల్ అవ్వకపోతారా వంటి ఆలోచనలు ఉన్నవారికి ఊహించని షాక్ ఇచ్చారు.


గ్రీన్ కార్డు రావడానికి ఎంత కాలం పట్టినా ఓపికగా ఉంటేనే వారి వారి పిల్లలు అమెరికా పౌరులుగా మారతారన్నమాట! గతంలోలాగా... అమెరికాలో ఉంటూ తాత్కాలిక ఉద్యోగ వీసాలు కలిగి ఉన్నవారు ఆ గడ్డపైనే జన్మనిచ్చిన పిల్లలకు వచ్చే ఆ దేశ పౌరసత్వం ఇకపై అందని ద్రాక్ష అన్నమాట!  ఇది అమెరికాలో హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి, ప్రధానంగా భారతీయులకు బిగ్ షాక్ అని అంటున్నారు.


పైగా "అమెరికా ఫస్ట్" అనే నినాదంతో పాలన మొదలు పెట్టిన ట్రంప్.. కొత్త ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అమెరికా పౌరులకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పలు కండిషన్స్ పెట్టి, ఉద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా.. లోకల్ రిజర్వేషన్ ని తెరపైకి తెచ్చే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే జరిగినా, ఉద్యోగం పోయినా గరిష్టంగా 90 రోజుల్లో ఆ దేశాన్ని వీడాల్సిన పరిస్థితి!


విద్యార్థుల విషయానికొస్తే... డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే చికాగోలో సుమారు 40 మంది భారతీయ విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారనే కారణంతో బహిష్కరించారనే విషయం షాకింగ్ గా మారింది.  ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఫలితంగా ఉజ్వల భవిష్యత్తు పొందాలని వెళ్తుంటారు విద్యార్థులు. ఈ సమయంలో బ్యాంక్ రుణాలు తీసుకుని వెళ్లేవారే ఎక్కువ అని అంటారు. ఈ సమయంలో అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరుగుండటంతో చాలా మంది విద్యార్థులు ఓపక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు.


అమెరికా వెళ్లి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు చదువుకుని, అక్కడే మంచి జాబ్ చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే వారి ఆలోచనలు విద్యార్థి దశలోనే ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అటు పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలోనూ ఏకంగా బహిష్కరణ వేటు వేయడం అనే అంశంతో పాటు బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దుతో అమెరికాకు వెళ్లడం ఎందుకు అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.


మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాల నుంచి ఇప్పుడు ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో అమెరికా వెళ్లాలి..? ఎందుకు వెళ్లాలి..? ఆ మాత్రం చదువులు, ఉద్యోగాలు స్వదేశంలో దొరకవా..? అనే చర్చ, ఆ ఆలోచనలు చేస్తున్న కుటుంబాల్లో మొదలవుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ట్రంప్ ఎఫెక్ట్ ఇప్పటికే మొదలైందనేది మాత్రం వాస్తవం!

మరింత సమాచారం తెలుసుకోండి: