మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.  అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ప్రధానంగా పనిచేసింది. ఈ ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకున్నారు జగన్.  రాష్ట్రం మొత్తం సంక్షేమం ఇస్తున్నాం కదా అని.. పదుల సంఖ్యలో గ్రామాల రైతుల ఆవేదనను ఎవరు వింటారులే అని భావించారు.  అంతటితో ఆగకుండా వారిని కేసులతో వేధించారు.  


ప్రధానంగా అమరావతి రాజధాని ఉద్యమంలో మహిళా రైతుల ది కీలక పాత్ర.  ఎన్నెన్నో అవమానాలను వారు ఎదుర్కొన్నారు.  అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవల్లి వంటి యాత్రలను చేపట్టారు.  వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.  సుదీర్ఘకాలం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.  అయితే కూటమి అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరుతాయని భావించారు.  కానీ ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు రైతులపై నమోదు చేసిన కేసులు కొట్టివేయలేదు.  దీంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.


మొన్నటికి మొన్న లోక్ అదాలత్ లో చాలావరకు కేసులను కొట్టివేశారు.  ఇంకా చాలా కేసులు మిగిలి ఉన్నాయి. ఇంకా రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ తమ కేసుల విషయంలో మాత్రం సరైన ఆదేశాలు ఇవ్వలేదన్న ఆవేదన అమరావతి రైతుల్లో ఉంది.  అయితే మొన్నటి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు.  కానీ దానిపై చర్చించకపోవడంతో మరోసారి నిరాశ చెందారు.


అమరావతి రాజధాని రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగున్నర సంవత్సరాల పాటు పెద్ద యుద్ధమే చేశారు.  అన్ని పార్టీల మద్దతు ఉన్నా.. తమ సొంత అజెండాతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో అమరావతి రైతుల కృషిని అభినందించాల్సిందే. పొరపాటున మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతి రైతుల పోరాటం నిష్ఫలంగా మారేది. కానీ టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. కానీ రైతులకు మాత్రం ఇంతవరకు ఉపశమనం కలగలేదు. వారిపై నమోదైన కేసులు కొట్టివేయలేదు. ఈ విషయంలో మాత్రం వారిలో ఉన్న అసంతృప్తి తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: