ఐదు దశాబ్దాల నక్సల్ బరి ఉద్యమం ఆఖరి గడియలు అనుభవిస్తోందా? వరుస ఎన్ కౌంటర్లతో విప్లవకారులు అమరులు అవుతున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తానని కేంద్ర పట్టుదలగా ఉంది. ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండటంతో ఉద్యమకారులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత ఏడాది సుమారు 260 మంది హతమయ్యారు. ఈ ఏడాది తొలి నెలలోనే మూడు భారీ ఎన్ కౌంటర్లలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.
దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పంతం పట్టి పనిచేస్తోంది. హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో చాలా ఫోకస్ చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేంతవరకు దేశంలో 200 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఈ పదేళ్లలో పోలీసు ఆపరేషన్ పెరిగిపోవడం, కొత్తగా మావోయిస్టుల రిక్రూట్ మెంట్ లేకపోవడం వల్ల మావోయిస్టుల ప్రభావం 40 జిల్లాలకే పరిమితమైంది.
గతంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమం బలంగా నడిచేది. అయితే ప్రస్తుతం కేవలం చత్తీస్ ఘడ్, ఆ రాష్ట్రంతో ఉన్న ఒడిసా సరిహద్దుల్లోనే మావోల ప్రభావం కాస్తోకూస్తో కనిపిస్తోంది. గత ఏడాది నుంచి భద్రతా దళాల గస్తీ మరింత పెరగడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు.
ఆపరేషన్ కాగర్ తో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. కేంద్రం ఈ ఆపరేషన్ ప్రకటించి వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులు లేని భారత్ ను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం మావోయిస్టుల్లో పాత తరం వారే ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా వంద లోపే ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి గుండెకాయ వంటి బస్తర్ అడవుల్లోని అబూజ్ మడ్ ప్రాంతంలో పోలీసులు తిష్ట వేయడంతో షెల్టర్ లేక ఉద్యమకారులు అల్లాడిపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది వ్యూహకర్తలే మిగిలినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోరాడే వారిని పార్టీ భారీగా కోల్పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడం కూడా కష్టంగా మారిందంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులదే పైచేయి కావడంతో ఉద్యమం బలహీనపడినట్లేనని అంటున్నారు.