తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా పార్టీలో జూనియర్లకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు గడుస్తున్న తరుణంలో.. కొత్త రక్తం ఎక్కించడం ద్వారా మరికొన్ని దశాబ్దాల పాటు ఉనికి చాటుకునేలా చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి సభ్యత్వాల నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ.
ఓ ప్రాంతీయ పార్టీ చరిత్రలోనే ఇంతటి సభ్యత్వ నమోదు ఎక్కడా లేదు. అయితే దానికి కారణం లోకేష్ కృషి ఫలితమేనని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కూడా సభ్యత్వ నమోదు పెరగడానికి కారణం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళనకు దిగితే బాగుంటుందన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని పార్టీలో అన్ని కార్యవర్గాల్లో యువతకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో అత్యున్నతంగా భావించే పొలిట్ బ్యూరోలో జూనియర్లకు స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి నేతలు ఏడు పదులు దాటారు. అందుకే వారికి గౌరవమైన పదవుల్లోకి పంపించి పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను పంపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టిడిపి శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. కూటమి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది తెలుగుదేశం పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలో ఇప్పుడు సుప్రీం గా వ్యవహరిస్తున్నారు లోకేష్. అయితే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పుడు రాజకీయంగా పరిణితి సాధించి.. అనుకున్నది సాధించగలుగుతారని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణకు సైతం పార్టీలో కీలక పోస్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి బాలకృష్ణకు అప్పగించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.