ఒకటో తారీకు వస్తుందంటే వేతన జీవులు ఎంతో భయపడుతుంటారు. ఇదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక తేదీ గడబిడ చేస్తోంది. నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధులు విడుదల చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందుకోసం జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది. మరో నాలుగు రోజుల్లో వచ్చే ఈ ముహూర్త సమయానికి ఖజానాలో రూ.20 వేల కోట్లు ఉండాలని అంటున్నారు. దీంతో ఆ మొత్తం నిధుల సేకరణకు ప్రభుత్వం అపసోపాలు పడుతోందని చెబుతున్నారు.
26 జనవరి ఈ డేట్ గుర్తొస్తేనే ఉలిక్కిపడుతున్నారు తెలంగాణ సర్కారోళ్లు. రాజ్యాంగం అమలైన రోజైన జనవరి 26 నుంచి పలు కీలక పథకాలను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా, ప్రభుత్వ ఖజానాలో మాత్రం అంత డబ్బు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు-పెన్షన్లు, రోటీన్‌గా జరిగి అభివృద్ది సంక్షేమ పథకాలకే నిధులు అరకొరగా ఉంటున్నాయి. పైగా గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు, నెలవారి వాయిదాలు చెల్లించే సరికే కాంగ్రెస్ సర్కార్‌కు తలప్రాణం తోకకు వస్తోందని సమాచారం.
రైతు భరోసా ఎకరానికి 6 వేల చొప్పున దాదాపు కోటీ 40 లక్షల ఎకరాలకు దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. భూమిలేని వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున 1320 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.
ఇదే సమయంలో ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోందంటున్నారు. ఇల్లులేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేయాల్సివుంది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున చెల్లించినా, కనీసం 5000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.
రైతు భరోసాకు 8400 కోట్లు, రైతు కూలీలకు 1,320 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5 వేల కోట్లు ఈ మొత్తం కలిపి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం అవుతాయి. ఇక జవనరి 26 తర్వాత నాలుగు రోజులకే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు మరో 4 వేల 500 కోట్లు కావాలి. అంటే తెలంగాణ సర్కార్‌కు ప్రస్తుతం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు అవసరం.