అమెరికాలోని మిషిగన్ స్టేట్‌లో.. ఓపెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం. వారి సెవిస్ (విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్య)ను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.
దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు.. వీరితో పని చేయించుకుంటున్న భారత్‌కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
ఇది.. అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో గుబులు రేపుతోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా ప్రతి ఏటా 2లక్షల ఎఫ్-1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40 శాతం భారతీయులకే కేటాయిస్తోంది. 2024లోనూ అమెరికా దాదాపు 84 వేల మంది భారతీయులకు ఎఫ్-1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకుని.. విద్యను పక్కనబెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు.
దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో పార్ట్‌టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న ఎఫ్-1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మద్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ఇక భవిష్యత్తులోనూ అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం ఎఫ్-1 వీసాదారుల్లో ఎక్కువగా నెలకొంది.