విజయసాయిరెడ్డి జగన్ కి కుడి భుజం లాంటి వారు. జగన్ కి తలలో నాలుకగా మెలిగారు. వైఎస్సార్ కుటుంబానికి మూడు తరాలుగా సన్నిహితుడు.  అలా దశాబ్దాల ప్రయాణంలో ఆయన జగన్ తో కలసి వైసీపీలో కీలకంగా మారారు.  పార్టీ వ్యూహాలలో ఆయన అతి ముఖ్య పాత్ర పోషించారు.  అటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా చెప్పడం అంటే వైసీపీకి రాజకీయ ప్రకంపనల కిందనే భావించాలి.


వైసీపీ పద్నాలుగేళ్ళ రాజకీయ ప్రస్తానంలో విజయసాయిరెడ్డి ప్రస్థావన చాలా చోట్ల ఉంటుంది. మరి జగన్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇపుడు ఇలా పార్టీకి జగన్ కి దూరం కావడం అంటే వైసీపీకి అది ఆశనిపాతం అని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ ఎన్నడూ లేనంతగా రాజకీయ సంక్షోభంలో ఉంది.  వరసబెట్టి ఎంపీలు పార్టీని వీడుతున్నారు.


మరి ఆయన హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే లోపాయికారీ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పార్టీలో ఆయనకు మునుపటి మాదిరిగా ఆదరణ అయితే లేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారని చెబుతారు. అయితే ఆయనను టార్గెట్ గా చేసుకుని విపక్షం స్వపక్షం విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


వాటిని అధిగమించి ముందుకు సాగారు. అలాంటిది ఇపుడు ఎందుకు రాజకీయ వైరాగ్యం వైపు మొగ్గు చూపారు అన్నది చర్చగా ఉంది.  జగన్ తో ఆయనకు ఉన్న సంబంధాలు ఎంతో గట్టివని భావిస్తూ వచ్చారు. వైసీపీలో ఆయన ప్లేస్ గొప్పది అని అనుకుంటూ వచ్చారు. తాను జీవించి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అని చెబుతూ వచ్చిన విజయసాయి రెడ్డి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు రాజీనామా రాజకీయ సన్యాసం అంటున్నారు అంటే ఆయనకు వచ్చిన కష్టం ఎంతటితో అన్న చర్చ కూడా సాగుతోంది.


విజయసాయిరెడ్డి పార్టీకి రాజకీయాలకు దూరం కావడం అందునా ఈ క్లిష్ట సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వైసీపీకి భారీ రాజకీయ నష్టం అని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయన ఈ ఇష్యూ ని ఏ విధంగా టేకప్ చేస్తారో. దాని ఫలితం పర్యవసానం ఎలా ఉండబోతోందో.


మరింత సమాచారం తెలుసుకోండి: