రాజకీయాల్లో సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి .. అవి నెగిటివ్గా అయినా ఉండొచ్చు .. పాజిటివ్గా అయినా ఉండొచ్చు. ఒకసారి నెగిటివ్ ముద్రపడితే చాలు .. అది ఎలాంటి పదవి అయినా ఎలాంటి నేత అయిన ఆ ముద్ర అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏపీలో ప్రతిపక్ష వైసిపి లోను ఒక పదవి ఇప్పుడు నెగిటివ్ సెంటిమెంట్ గా మారింది. అదే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి. మామూలుగా విశాఖ జిల్లా అధ్యక్షుడు పదవి అంటే వైసీపీలో ఎంతో గౌరవం ఉంటుంది. విశాఖ కీలకమైన నగరం .. అయితే ఆ పదవి చేపట్టిన వారికి రాజకీయంగా ఇబ్బందులు తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు గాజువాక ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను చోడవరం కు బదిలీ చేసేశారు. గతంలో ఈ పదవి చేపట్టిన నేతలకు రాజకీయంగా చేదు అనుభవాలు తప్పలేదు. విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం ఉన్న వంశీకృష్ణ యాదవ్ కు 2014లో ఓటమి తప్పలేదు .. 2019లో సీటు రాలేదు.
చివరకు వంశీ కి మేయర్ పదవి వస్తుందనుకున్నా రాలేదు. చివరి పైన పార్టీ వీడి బయటకు వచ్చి జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి టికెట్ ఆశించి వైసిపి లో చేరితే ఆయనకు మొండి చేయి చూపించారు. ఇది కూడా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎఫెక్ట్ అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇక నగర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఈ పీఠం బాధితుడే .. అసలు ఓటమి ఎరుగని ఆయన మొన్న ఎన్నికలలో భీమిలిలో ఏకంగా 95 వేల ఓట్ల తేడాతో ఘోరంగా చిత్తుచిత్తుగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి అంటేనే అందరికీ భయం పట్టుకుంది.