వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం ఈ పరిస్థితిని ఎదుర్కొంటే ఇప్పుడు వైసీపీలో అదే ఆందోళన కనిపిస్తోంది. విధేయత విషయంలో చంద్రబాబు కంటే.. జగన్ ను ఎక్కువ మంది నమ్ముతారు. కానీ ఇప్పుడు జగన్ వీర విధేయులే పార్టీకి ఊహించని షాక్ ఇస్తున్నారు. వీరు పార్టీ మారతారు అని సాధారణ కార్యకర్తలు సైతం ఊహించలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా జగన్ కష్టాల్లో, సుఖాల్లోను విజయసాయి రెడ్డి తోడు ఉండేవారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో నెంబర్-2గా వెలుగొందారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి చక్రం తిప్పారు. ఆయన రాజ్యసభకు పంపి.. వైసీపీ పార్లమెంటరీ పక్ష నేతగా సైతం నియమించారు. అంతేకాక నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన వైసీపీలో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా నిలిచారు. అటువంటి నేత పార్టీకి గుడ్ బై చెప్పడం నిజంగా లోటే.
వాస్తవానికి జగన్ కు వైసీపీలో అత్యంత సన్నిహిత నేతలు చాలామంది ఉన్నారు. రాజకీయంగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. రాజకీయ విధేయులుగా కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా రాజకీయంగా మంత్రాంగం నడిపేవారు మాత్రం లేకుండా పోయారు. ఇప్పటివరకు ఆ పాత్రలో విజయసాయిరెడ్డి ఒదిగిపోయారు.
ప్రస్తుతం వైసీపీకి అత్యవసరంగా ట్రబుల్ షూటర్ కావాలి. పార్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యక్తి కావాలి. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపే నేత కావాలి. అంతకుమించి జగన్ కు ప్రయోజనం చేకూర్చే నేత కావాలి. పార్టీ పూర్వ వైభవానికి మనస్ఫూర్తిగా పనిచేసే నాయకుడు కావాలి. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉన్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్న తరుణంలో.. అటువంటి ట్రబుల్ షూటర్ దొరుకుతారా? అంటే వైసీపీ నుంచి సమాధానాలు దొరకడం లేదు.