ఈసారి ఢిల్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఫిబ్రవరి 5న  70  స్థానాలకు పోటీ జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి.  ఆప్‌ బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. అయితే మధ్యలో కాంగ్రెస్ కూడా  వచ్చి చేరింది.  పదిహేనేళ్ళ పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ కి కొన్ని వర్గాలలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది.  దీంతో కీలకమైన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో త్రిముఖ పోరు సాగుతోంది.   కాంగ్రెస్ గెలుస్తుందా అంటే తెలియదు కానీ ఆ పార్టీ ఓట్లు గణనీయంగా పట్టుకుని పోతే అది అంతిమంగా ఆప్ అధికారానికి చేటు తెస్తుంది అని అంటున్నారు.


బీజేపీ విషయం తీసుకుంటే 2020 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈసారి బలాన్ని బాగా పెంచుకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదంతో ప్రచారాన్ని ఊపేస్తుంది.  వరసగా మూడు సార్లు ఆప్ కు అధికారం దక్కడంతో ఈ సారి బీజేపీకి ఆదరణ దక్కుతోంది. అయితే అధికారం దక్కేంత ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.


ఆప్ గత పన్నెండేళ్ళుగా నాన్ స్టాప్ గా అధికారంలో ఉంది.  ఆ పార్టీ విషయంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు. కేజ్రీవాల్ క్రేజ్ కూడా గతంతో పోలిస్తే తగ్గుతోంది.  ఆప్ లో వర్గ పోరు అధికార పార్టీలో ఉండాల్సిన జాడ్యాలు అన్నీ కలగలిసి చీపురు పార్టీకి కొత్త భారాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.  గతంలో దక్కిన 60కి పైగా సీట్లు ఈసారి దక్కకపోయినా సగానికి సగం అయినా ఆప్ కి వస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి.


అదే జరిగితే ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 36 సీట్లు ఏ పార్టీకి దక్కే సూచనలు ఉండవని అంటున్నారు. అపుడు హంగ్ రావచ్చు అని చెబుతున్నారు. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి.  అయితే ఆప్ కి ఏ 30 దక్కి కాంగ్రెస్ కి ఆరేడు సీట్లు దక్కినా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అని అంటున్నారు.


బీజేపీకి హంగ్ వస్తే ఆ చాన్స్ అసలు ఉండదని అంటున్నారు.  కాంగ్రెస్ రాజకీయం మార్చడానికి తగిన భూమికను పోషిస్తోంది. కాంగ్రెస్ తాను బలపడి కొన్ని సీట్లు సాధిస్తే అది ఆప్ కి సహాయంగా ఎన్నికల తరువాత మారవచ్చు.  అలా కాకుండా ఓట్లు చీలిస్తే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుంది.  మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: