ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తోంది. అనేక రాజకీయ చర్చలకు వేదికగా మారింది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం పక్కన పెడితే.. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం అనే అంశంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. అసలు జగన్ తెర వెనుక ఉండి ఆయనతో రాజీనామా చేయించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఏపీలో రాజకీయ పరిస్థితులను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీని నిర్వీర్యం చేసి.. తమ బలం పెంచుకోవాలన్నది బీజేపీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీల ద్వారా రాజీనామా చేయించి.. పదవులు తీసుకోవాలన్నది వారి ప్లాన్. ఈ విషయంలో జనసేన సైతం వారికి సహకరిస్తోంది. తెలుగుదేశం పార్టీది ఒప్పుకోక తప్పని పరిస్థితి.
ఏపీలో టీడీపీకి వ్యతిరేక పక్షం వైసీపీ. ఇది కాదనలేని సత్యం. వైసీపీ బలహీన పడితే లాభం టీడీపీకి రావాలి. లేకుంటే జనసేన దానిని క్యాచ్ చేసుకోవాలి. కానీ బిజెపి క్యాష్ చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం తర్వాత జనసేన కొనసాగుతోంది. కానీ మూడో స్థానంలో ఉన్న బీజేపీ రాజ్యసభ పదవి తీసుకుంది. అంటే ఆ పార్టీ తన బలం పెంచుకుంటోంది. ఇప్పుడు ఖాళీ అయిన ఈ స్థానం బీజేపీ ఖాతాలోనే పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మొన్న మూడు రాజ్యసభ సీట్లకు చివరి నిమిషం వరకు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అగ్ర నేతలు ఎంటర్ అయ్యారు. కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ రెండు సీట్లను తీసుకుంది. ఒక సీటు జనసేనకు కేటాయించింది. అప్పుడే బీజేపీ అగ్ర నేతలు పవన్ కు విన్నపం పంపారు. వెంటనే ఆయన అంగీకరించారు. అంటే కాషాయం బలం పెరగడానికి పవన్ దోహదపడుతున్నట్లు అర్థమవుతోంది.
వైసీపలో పదవులకు రాజీనామా చేసిన నేతలు.. ఏ పార్టీలో చేరుతారో అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రతి రాజీనామా వెనుక బీజేపీ ప్రయోజనం పొందుతుంది. రాజీనామాలతో వైసీపీ బలం పడిపోతుండగా.. కమలం నేతలు బలంగా క్రమేపీ పెంచుకుంటున్నారు.