ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రకటన గత ఎన్నికల తర్వాత పూర్తిగా కుదేలైన విపక్ష వైసీపీకి వరంగా మారబోతోంది.   గత ఎన్నికల తర్వాత మొక్కుబడిగా పోరాటాలు చేస్తూ జనంలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్న జగన్ ను తట్టిలేపేలా ఉంది.  రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు ఎన్నో హామీలు ఉన్నాయి.  వీటిలో సూపర్ సిక్స్ హామీలతో పాటు మ్యానిఫెస్టోలో చెప్పిన పలు అంశాలున్నాయి.


సరిగ్గా ఇటువంటి సమయంలో  రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేదని చంద్రబాబు గణాంకాలతో జనం ముందుకొచ్చారు.  శరీరం ఆరోగ్యంగా లేకపోతే తగిన వైద్యం చేయాల్సిందే అంటూ చెప్పారు.  సంక్షేమం అంత ఈజీ కాదని సంకేతాలు పంపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమంటూ సుతి మెత్తంగా చెప్పుకొచ్చారు.   రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాల అమలుకు మరి కొన్ని రోజులు ఆగక తప్పదని తేల్చి చెప్పారు.


మరి ఈ విషయం ఆయనకు ఎన్నికల ముందు తెలియదా అంటే తెలుసు.  ఎన్నికల ప్రచార సభల్లో జగన్ లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. తనకు సంపద సృష్టి తెలుసని.. పథకాలు ఎలా అమలు చేయాలో కూడా తెలుసని పలు సందర్భాల్లో పదే పదే చెప్పారు.  దీంతో ప్రజలు కూటమికి జై కొట్టేశారు.   అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సంక్షేమ పథకాల్లో పెన్షన్ల పెంపు హామీని మాత్రమే నిలబెట్టుకున్నారు.  మిగతా హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదు.  


రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక సైలెంట్ గా ఉంటున్న వైఎస్ జగన్ తాజాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నిరసనలకు పిలుపునిచ్చారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు కావడం లేదంటూ మరో రెండు నిరసనలకు పిలుపిచ్చారు. అయితే వీటిలో వైసీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నా జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు.  ఇప్పుడు పథకాల అమలు వాయిదా రూపంలో ప్రభుత్వం మరో భారీ అస్త్రం జగన్ చేతికి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే విపక్షంగా జనంలో ఉండాల్సిన జగన్ ఇంట్లోనే ఉండిపోతే ఎలా పోరాడాలి కదా అని గుర్తుచేసింది. మరి దీనిని జగన్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: