అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్.. ఆ తర్వాత మూడు రోజుల్లోనే వలసల్ని గుర్తించి తరిమేయడం ప్రారంభించారు. వేల సంఖ్యలో వలసదారుల్ని అరెస్టులు చేయడంతో పాటు వారిని ప్రత్యేక ఆర్మీ విమానాల్లో ఎక్కించి మరీ దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.  


500 సైనిక విమానాల ద్వారా వారిని స్వదేశాలకు తిప్పి పంపుతుంది.  తాజాగా బ్రెజిల్ నుంచి అక్రమంగా వచ్చి అమెరికాలో జీవిస్తున్న పలువురిని గుర్తించి తిరిగి స్వదేశానికి పంపించింది. ఈ క్రమంలో వారికి నరకం చూపించింది.  జైల్లో ఉన్న ఖైదీల పట్ల చూపించే కనికరం కూడా చూపించకుండా దారుణంగా వారిని తరలించడంపై బ్రెజిల్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


వలసదారుల చేతులకు బేడీలు వేసి, ఏసీ, నీరు కూడా అందుబాటులో లేని విమానాల్లో ఎక్కించి పంపుతున్నారని ఆరోపించింది.  ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆరోపించింది. అక్రమ వలసదారులైనంత మాత్రాన ఇంత దారుణంగా, అవమానవీయంగా వ్యవహరించాలా అని ప్రశ్నిస్తోంది. ఓ విమానం బ్రెజిల్ ఉత్తర నగరమైన మనౌస్‌లో ల్యాండ్ అయినప్పుడు ఈ దృశ్యాలు కనిపించాయి.  విమానంలోని 88 మంది బ్రెజిలియన్లు చేతికి సంకెళ్లతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.



విమానంలో ఉండగా.. దాహం వేస్తుందని అడిగితే కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టారని వారు చెప్పారు. బాత్రూం వెళ్లాలని చెప్పినా వారు పట్టించుకోకుండా తమను అలాగే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీళ్లు లేక బాత్రూంకు వెళ్లలేక అనేక మంది అస్వస్థతకు గురయ్యారని వివరించారు. అయితే తక్షణమే వారి చేతులకు చేతి సంకెళ్ళను తొలగించాలని బ్రెజిల్ న్యాయశాఖ అమెరికా అధికారుల్ని ఆదేశించింది.


మరోవైపు ఇలా అమెరికా నుంచి వలసల బహిష్కరణ విమానాలను తిరస్కరించినందుకు డొనాల్డ్ ట్రంప్ కొలంబియాపై ఆంక్షలు విధించారు.  కొలంబియాపై సుంకాలు, ఆంక్షలు, ప్రయాణ నిషేధాలతో సహా అన్ని ఆంక్షలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇలా తమ దేశాలకు చెందిన వలసదారుల్ని ఆహ్వానించేందుకు నిరాకరించే దేశాలన్నింటికీ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: