గతంలో జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. టీడీపీ అలా పుట్టుకొచ్చిందే. సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే ప్రాంతీయ పార్టీలు దూకుడుగా ఉన్నన్నాళ్లు జాతీయ పార్టీలకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కొనసాగుతోంది. పేరుకే తాము జాతీయ పార్టీలు అని.. ప్రాంతీయ పార్టీల కింద పనిచేయాల్సి వస్తోందన్న ఆవేదన ఆ పార్టీల్లో ఉంది.
అయితే ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్లంతా.. ఒకప్పుడు జాతీయ పార్టీ నేతలే. మమతా బెనర్జీ, శరత్ పవార్, వైఎస్ జగన్, కేసీఆర్ లు ఇలా వీరంతా ముందుగా వేరే పార్టీలో ఉండి తర్వాత సొంతంగా పార్టీ స్థాపించిన వారే. ఇక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్వాది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో జోరు మీద ఉన్నప్పుడు కాంగ్రెస్ దూకుడు తగ్గింది. ఎప్పుడైతే బహుజన్ సమాజ్వాది పార్టీ వీక్ అయ్యిందో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అధికారంలోకి రాగలిగింది. అంటే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి ముందుకు వచ్చాయన్నమాట.
తమిళనాడులో దశాబ్దాలుగా జాతీయ పార్టీలు అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ విఫలమవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకె గొడుగు కింద.. బిజెపి అన్న డీఎంకే గొడుగు కింద పని చేయాల్సి ఉంది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా బీజేపీకి స్నేహ హస్తం అందించిన ఠాక్రే కుటుంబానికి కూడా షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకుంది.
ఏపీలో టీడీపీ, వైసీపీలు బలంగా ఉన్నాయి. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్ నడిచింది. ఈ సారి ఎన్నికల్లో జనసేన వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ వైసీపీని కబళించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ప్లేస్ లోకి జనసేన ను పంపించి... జనసేన ప్లేసులో బీజేపీ రావాలన్నది వారి ఆలోచనగా ఉండొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీనం చేయాలని కాషాయ దళం పావులు కదుపుతోంది.
ఇదే టీడీపీని భయాందోళనకు గురి చేస్తోంది. వైసీపీతో అయితే నేరుగా తలపడవచ్చు. కానీ బీజేపీతో అలా కుదరదు. బీజేపీకి ఢీకొడితే ఏం జరుగుతుందో చంద్రబాబు గతంలో చూశారు. అందుకే వైసీపీని బలహీనం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు లేరు. ఒకవేళ ఆ ప్లేస్ లోకి బీజేపీ వస్తే మాత్రం టీడీపీకి ఇబ్బందులు తప్పవు. చూడాలి మరి ఏం జరుగుతుందో.