సడెన్ గా హెడ్డింగ్ చూసి కూటమిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశ్చర్యపోతున్నారా? సీఎంగా పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ ఏంటని ఆలోచిస్తున్నారా..? మొన్నటి వరకు లోకేశ్ ని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్లు… పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని జనసైనికులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ సినీ డైరెక్టర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ.
సినీ పెద్దాయనగా ఉన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు నిన్న రాత్రి ఒక కల వచ్చిందట. ఆయన కలలో తన గురించి కాకుండా ఏపీ రాజకీయాల గురించి రావడం ఇక్కడ విశేషం. అది కూడా అలాంటి ఇలాంటి కల కాదు. రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసే కల. ఆ విషయాన్ని ఆయన వీడియో బైట్ ద్వారా మీడియాతో పంచుకున్నారు. తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో పవన్ కళ్యాణ్ సీఎం గా నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా అయినట్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇద్దరూ రాష్ట్రాన్ని సక్సెస్ ఫుల్ గా పాలిస్తున్నట్లుగా తనకు అనిపించిందని ఈ లోగా కల చెదరి మెలకువ వచ్చిందని బాంబు పేల్చారు. ఈ కల నిజమైతే బాగుంటుందని ఆయన చెప్పడం కొసమెరుపు. పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలని చాలా మంది అనుకుంటున్నారని ముఖ్యంగా ఆయన అభిమానులు ఇదే ఆశ పడుతున్నారని అన్నారు. ఇక నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కూడా అనేక డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెబుతూ తన కల నిజం అయితే మాత్రం ఈ రెండు కోరికలూ తీరిపోతాయని అన్నారు.
మరి సీఎం చంద్రబాబుకి ఏం పదవి అనేగా మీ ఆలోచన. దానికి కూడా ఆయన తన కలలో చోటు ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా తప్పుకుని కూటమికి చైర్మన్ హోదాలో ఉంటూ ఈ ఇద్దరికీ ఇలా కీలక పదవులు ఇచ్చారని తమ్మారెడ్డి తన కల గురించి వివరించారు. తాను లేకపోతే ఏపీ ఏం అవుతుందని చంద్రబాబు దిగులు చెందుతున్నారని కానీ.. ఏపీలో ఇద్దరు నాయకులు ఉద్భవించారు అని వారే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అని అన్నారు. ఈ ఇద్దరు నాయకులూ ఏపీని అద్భుతంగా పాలిస్తారని తాను నమ్ముతున్నాను అని తమ్మారెడ్డి కొసమెరుపు మెరిపించారు.