ఇప్పుడు అందరి చూపు దిల్లీ ఎన్నికలపై పడింది.  త్రిముఖ పోటీలో గెలుపెవరిది..? కాంగ్రెస్ ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. విజయం కేజ్రీవాల్ దా .. లేక కాషాయ పార్టీదా అనే లెక్కలు ఎవరికి వారు వేసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రతి గల్లీని వదిలిపెట్టకుండా తమ వ్యూహాలను అమలు చేస్తోంది. ఆప్ పార్టీ మాత్రం కేజ్రీవాల్ మీద ఆధారపడి సాగుతోంది. ఈ తరుణంలో పలు సర్వేలు దిల్లీ గెలుపుపై తమ అభిప్రాయాలను వెలువరుస్తున్నారు.


దిల్లీలో ఎన్నికలపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రీ పోల్ సర్వేలతో ఓటర్ల మూడ్ గుర్తించే పని ప్రారంభించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ప్రచారం ముగియనుంది.  ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి.  ప్రధాని మోదీ దిల్లీలో ప్రచారానికి దిగుతున్నారు. ప్రధాని ప్రచారం పైన బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది.  కేజ్రీవాల్ ప్రతీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆశించిన చొరవ చూపించటం లేదు. రాష్ట్ర స్థాయి నాయకత్వమే ప్రచార బాధ్యతలు తీసుకుంది.   



దిల్లో సగానికి పైగా ఓటర్లలో మహిళలే ఉన్నారు.  ఎస్సీ ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.  దీంతో, మహిళలను ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు తమ హామీల్లో ప్రాధాన్యం ఇచ్చాయి.  తాజా సర్వేల్లో మహిళా ఓటర్ల మద్దతు పైన తమ సర్వే అంచనాలను వెల్లడిం చాయి.  నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ -ది కన్వర్జెంట్ మీడియా సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి.  మెజార్టీ దళిత ఓటింగ్ ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు.  అదే విధంగా 44 శాతం మంది మహిళలు సైతం ఆప్ వైపే మద్దతుగా నిలుస్తున్నారని అంచనాలను వెల్లడించింది.


దళిత ఓటింగ్ లో ఆప్ కు 35 స్థానాల్లో.. బీజేపీ 28, కాంగ్రెస్ 7 స్థానాల్లో మెజార్టీ సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.  దిల్లీలో 12 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఈ సారి ఎస్సీ మోర్చా నేతలను ప్రచార బరిలోకి దించింది.  ఇక, సామాజిక - స్థానిక అంశాలే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు ప్రచారంలో కొత్త టర్న్ తీసుకున్నారు. దీంతో, ప్రత్యర్థుల వ్యూహాలకు ధీటుగా పార్టీలు కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. రోజు రోజుకీ మారుతున్న లెక్కలతో ఢిల్లీ అసెంబ్లీ సమరం మరింత ఉత్కంఠ పెంచుతోంది. ఏం జరగనుందో ఫిబ్రవరి 8న తేలనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: