వైఎస్ జగన్ మీద ఆది నుంచి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.  పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవి మరింత తీవ్రం అయ్యాయి. అవకాశం ఉన్న ప్రతి సారి ఆమె జగన్ పై నిప్పులు చెరిగారు.  అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ ని వదిలిపెట్టడం లేదు.  ఇప్పటికి గత ప్రభుత్వ లోపాలనే ఎత్తి చూపుతూ వైసీపీ మీద ఒంటికాలి మీద లేస్తున్నారు.  అలాంటిది ఇప్పుడు జగన్ పై కాంగ్రెస్ స్వరం మార్చిందనే టాక్ నడుస్తోంది.


కాంగ్రెస్ లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు గడించి అమలాపురం నుంచి వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన జీవీ హర్ష కుమార్ తాజాగా చంద్రబాబు మీద విమర్శల జడివాన కురిపించారు.  సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని ఆర్థిక పరిస్థితులే కారణం అని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.  జగన్ అయిదేళ్ళూ ఎలా అమలు చేశారని ఆయన ప్రశ్నిస్తూ మీ కంటే ఆయనే నయం కదా అని కూడా అన్నారు.  ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే మీరు ఇలా హామీలను వదిలేయాలనుకోవడం జనాలను మోసం చేయడం కాదా అన్ని ప్రశ్నించారు.



ఇంకా జగన్ హయాంలో పేదలకు న్యాయం జరిగిందని హర్ష కుమార్ మాట్లాడటం విశేషం.  అనంతపురానికి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాధ్ జగన్ గురించి బాగానే మాట్లాడుతున్నారు.  జగన్ సొంత జిల్లా కడపకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ తులసీరెడ్డి కూడా జగన్ ని వెనకేసుకుని వస్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం వైసీపీని కొంత ఇబ్బందిగా ఉన్నా వైసీపీ కనుమరుగు అవుతుంది అన్నది తప్పు అని ఆయన అంటున్నారు.


కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత వస్తే వైసీపీ వైపు చూసినా చూస్తారు అని విశ్లేషించారు.   ఇలా కాంగ్రెస్ నేతలు అంతా కూడా జగన్ విషయంలో ఎంతో కొంత సాఫ్ట్ స్టాండ్ తో ఉండడం కనిపిస్తోంది. కాంగ్రెస్ 2029 నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఏపీలో కాంగ్రెస్ సొంతంగా ఎదగలేదు, పొత్తులు కావాలి, ఆ పొత్తులకు వైసీపీయే సరైన ఆల్టర్నేషన్ అన్నది సీనియర్ల భావన అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: