ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు సిద్ధం అయింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో వాట్పస్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్లి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. గురువారం నుంచి వాట్సాప్ గవర్నెస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరులోనే వాట్సాప్ మేనేజింగ్ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం సాంకేతిక మార్పులు పూర్తి చేసింది. 8 శాఖల పరిధిలోని 161 రకాల సేవలు వాట్సాప్ లోనే అందుబాటులో ఉంటాయి. ఒక క్లిక్ తో ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లు క్షణాల్లోనే తీసుకోవచ్చునని ప్రభుత్వం తెలియజేసింది.
మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఆర్టీసీ బస్సు పాసుల కోసం రోజుల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుందని, దీనివల్ల సమయాభావంతో పాటు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నామని చెప్పుకున్నారు. ఈ సమస్యను గుర్తుపెట్టుకున్న యువనేత లోకేశ్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలకు అవసరమైన సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
ఇక వాట్సప్ గవర్నెర్స్ పై సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. దేశంలోపే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలుకుతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబరులో మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం వాట్సాప్ గవర్నెస్ ను అందుబాటులోకి తెస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై దేవాదాయ, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 161 పౌర సేవలు ఒక క్లిక్ తోనే అందుబాటులోకి రానున్నాయి.
గతంలో క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు ఆఫీసులు, నలుగురు అధికారులను కలవాల్సివచ్చేది. ఇక కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లుల చెల్లించాలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెస్ అందుబాటులోకి రావడంతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.