తెలంగాణలో ధరల పెంపునకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పథకాల అమలుకు నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర సర్కారు ఆ లోటును పూడ్చుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మద్యం ప్రియులకు షాక్ ఇవ్వబోతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ యోచనలో ఉంది. ఈ పెంపు ధరలను త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు, మద్యం ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బ్రాండెడ్ మద్యం, బ్రాండెడ్ బీర్లు, చీప్ లిక్కర్ ధరలను పెంచాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.
బీర్ల ధరలను గట్టిగా పెంచేందుకు సర్కార్ యోచనలో ఉంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే బ్రూవరీలు, ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వమే ప్రతి రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈ సారి వివిధ రకాల బ్రాండ్లపై 20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధరలను పెంచాలని బ్రూవరీలు కోరినట్లు సమాచారం. మద్యం ధరలు సుమారు 15 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా జరిగితే ఎక్సైజ్ శాఖకు అదనంగా మరో రూ. 5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది.
ఈ అంశంపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ప్రీమియం బ్రాండ్లపై, బీర్లపై దాదాపు 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ వ్యాప్తంగా 2260 మద్యం దుకాణాలు, 1171 బార్లు ఉన్నాయి. వీటికి 6 బ్రూవరీల నుంచి ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుంది. దసరా పండుగ సమయంలో 10 రోజుల్లో రూ. 1,100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలయ్యాయి. అందులో 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి.