గణతంత్ర దినోత్సవం జనవరి 26 పురస్కరించుకొని తెలంగాణలో పలు సంక్షేమ పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మండలానికో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని రైతు భరోసా సొమ్మును విడుదల చేశారు. ఎకరానికి 6 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 41వేల 911 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో 593 కోట్లు జమ చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దాదాపు రూ.10 కోట్లను కూడా లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు.
అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ నాలుగు పథకాలపై ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ మండలానికి ఒక్క గ్రామమే ఎంపిక చేయడంతో మిగతా వారు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో దాదాపు 12 వేల గ్రామాలుంటే 577 గ్రామాల్లోని రైతులకు మాత్రమే రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా డబ్బులు అందాయి. ఇంకా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 10 లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందాల్సి ఉంది.
మార్చి 31 లోపు అర్హులందరికీ ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుబంధును మూడు నాలుగు నెలల పాటు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాము కూడా మార్చి 31 లోపు రైతులు, రైతు కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తే ఇంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 26 నుంచి నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో.. అన్నదాతలంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. మిగతా వారికి ఇప్పుడే కాదు.. మార్చి 31 వరకు దశలవారీగా అమలు చేస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
ఓ వైపు రైతులు.. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మరి ఈ పథకాల అమలు విషయంలో రేవంత్ సర్కార్‌కు క్లారిటీ లేదా.? లేకపోతే పక్కా ప్రణాళిక రూపొందించలేదా.? సమన్వయ లోపమా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మొత్తం మీద ఈ విషయం సెల్ప్ గోల్ అయిందని పలువురు పేర్కొంటున్నారు.