ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన హామీల్లో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీలు..ఇప్పుడు వాటిపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు 20 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి.
చంద్రబాబు అధ్యక్షతన మూడో రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి కీలక పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.44,776 కోట్లు. ఈ మేర పెట్టుబడుల్ని ఆమోదిస్తూ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైన అధికారులతో చర్చించారు.
ఇదిలా ఉండగా ఏపీలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని.. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 4 లక్షల వరకు ఉద్యోగాలు యువతకు వస్తాయని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇక ఇదే అంశంపై నారా లోకేశ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 16 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని తెలిపారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సర ప్రారంభంలోపు ఈ క్రతువును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఏపీలోను, నవ్యాంధ్రప్రదేశ్ లోను 80శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్య చర్చలు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం మీద ఏపీలో యువత ఆశలు నెరవేరుతున్నాయనే అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతుంది. వరసగా ఉద్యోగ ప్రకటనలతో కూటమి ప్రభుత్వం మంచి జోష్ లో ఉందని విశ్లేషకులు అంటున్నారు.