సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ సేవలను ఏపీలో మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీ తనం, ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఉండవల్లిలో ఈ వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ మేరకు మెటా సంస్థతో 2024 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకొంది కూటమి సర్కారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ సేవలను ప్రారంభించినట్టు లోకేశ్ తెలిపారు. పుట్టుక నుంచి మరణం వరకు అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రస్తుతం తొలి దశలో 161 రకాల సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో 955230 0009 నెంబరును ఆవిష్కరించారు.
దేవదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల సేవలను పొందవచ్చు. జనన, మరణ ధ్రువపత్రాలు పొందవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. విద్యా సంబంధిత సమాచారాన్ని, పత్రాలను కూడా పొందవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్ సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా ఫోన్‌లోనే పొందే సౌకర్యం ఉంటుంది. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
కీలకమైన ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చేసుకున్న దరఖాస్తుల స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ వాట్సాప్ ద్వారా విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు కూడా వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యం ఉంది. విపత్తులు, విద్యుత్తు కోతల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సమాచారం లేదా పత్రాలు పొందాలనుకునేవారు.. ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబరుకు మీ నంబర్ ద్వారా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. వెంటనే సంబంధిత లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు పేర్కొని కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.