తొలుత కంప్యూటర్ యుగం… ఆ తర్వాత టెలికాం యుగం.. తదుపరి ఇంటర్నెట్ యుగం.. ఇప్పుడు డిజిటల్ యుగం.. భవిష్యత్తులో ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఇక మన ఇండియా కూడా ఏఐ యుగంలో దూసుకుపోయేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ అంశం ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ అదేంటంటే..
భారత్ లో ఆర్దిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్దితిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మందగమనానికి కారణమవుతున్న పరిస్దితుల్ని రంగాల వారీగా వివరించారు. కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా భారత్ లో ఉద్యోగాల ముప్పు ఎదుర్కొంటున్న రంగాలపై కూడా ప్రత్యేకంగా వివరాలు అందించారు. ఏఐ ఎంట్రీ వల్ల ఆయా రంగాలపై ప్రభావం ఎలా ఉండబోతోందో ఇందులో పేర్కొన్నారు.
ఆర్థిక సర్వే 2024-25లో భారత్ లో ఉద్యోగుల్లో నైపుణ్యాల లేమిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తక్కువ నైపుణ్యం, తక్కువ విలువ కలిగిన సేవా రంగం ఏఐ ఆధారిత ఆటోమేషన్ కు మారిపోవడం ఖాయమని తేల్చేసింది. ఎక్కువగా రిపీట్ అయ్యే పనులు ఉన్న రంగాల్లో ఉద్యోగులకు బదులుగా ఏఐ టెక్నాలజీకి సంస్ధలు మారిపోతాయని, ఖర్చులను తగ్గించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతతో మానవ కార్మికులను భర్తీ చేస్తాయని సర్వే చెబుతోంది.
ఉద్యోగులు, కార్మికులు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్న సంస్థలు కూడా వాటిని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక సర్వే పేర్కొంది. సాంకేతిక విప్లవాలు సహజంగానే ఎక్కువ శాతం కార్మికుల ఉద్యోగాలను హరిస్తాయని, ఇది ఆర్ధిక అసమానతలకు కూడా దారి తీస్తుందని తెలిపింది. ఇలా ఎక్కువగా ఉద్యోగాల కోతల్ని, మార్పుల్ని భారత్ వంటి అవసరం కన్నా ఎక్కువగా ఉద్యోగులు కలిగిన దేశంలో సంస్థలకు ఇబ్బందికరంగా మారుతుందని వెల్లడించింది.
కొత్త ఉద్యోగాల సృష్టి కూడా భారీ టాస్క్ అని ఆర్ధిక సర్వే తేల్చేసింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఉన్న డిమాండ్ మేరకు చూసుకుంటే 2030 వరకూ ఏటా 78.5 లక్షల ఉద్యోగాల్ని ప్రభుత్వం వ్యవసాయేతర రంగాల్లో సృష్టించాల్సి ఉంటుందని ఆర్ధిక సర్వే తెలిపింది.