దేవినేని ఉమామహేశ్వరరావు మాజీమంత్రి .. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలను రెండున్నర దశాబ్దాల పాటు తన కను సైగలతో శాసించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉమా మాటకు ఎదురు ఉండేది కాదు. 1999 - 2004 ఎన్నికలలో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఉమా 2009 - 2014 ఎన్నికలలో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. నాలుగు సార్లు గెలిచిన దేవినేని ఉమా మహేశ్వర రావు 2019 ఎన్నికలలో ఒకే ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఒక్క ఓటమి తోనే ఉమా రాజకీయ జీవితం పూర్తిగా తలకిందులు అయింది. 2019 ఎన్నికలలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయిన ఉమా 2024 ఎన్నికలలో అదే కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో తన సీటు వదులుకోక తప్పని పరిస్థితి.
మొన్న ఎన్నికలలో ఉమా పోటీ చేయలేదు .. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కీలకమైన పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఉమా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న చర్చ కృష్ణా జిల్లాలో వినిపిస్తోంది. యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన ఏ కార్యక్రమమూ నిర్వహించలేదు. చంద్రబాబు సూచనల మేరకు మీడియా ముందుకు కూడా రాలేదు .. అసలు నందిగామ - మైలవరం నియోజకవర్గాలలోనే కనిపించడం లేదు. ప్రస్తుతం దేవినేని ఉమా హైదరాబాదులోనే మకాం వేశారని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఏదియే మైనా ఒకే ఒక్క ఓటమి దెబ్బకు ఉమా రాజకీయ జీవితం ఇంతలా తలకిందులు అవుతుందని ఎవరు ఊహించలేదు.