మరో నాలుగు రోజుల్లో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణలంలో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు హ్యాండ్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యే పదవులకు అనూహ్యంగా రాజీనామాలు సమర్పించారు. తక్షణం ఆమోదించాలని స్పీకర్‌ను విన్నవించారు. అనంతరం.. సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు బహిరంగ లేఖలు రాశారు.
ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఢిల్లీలోని ద్వారకలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్పై నిప్పులు చెరిగారు. బీజేపీని గెలిపిస్తే.. కేజ్రీవాల్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని, పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. అనంతరం.. 6 గంటల సమయంలో ఆయన పర్యటన ముగించుకుని తన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.
మరో అరగంట గడిచేసరికి.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు దిమ్మతిరిగిపోయే పరిణామం ఎదురైంది. ఏడుగురు ఎమ్మెల్యేలు.. రోహిత, రాజేష్, మదన్‌లాల్, నరేష్ యాదవ్, పవన్ శర్మ, బీఎస్ జూన్ సహా భావనా గౌర్ తమ పదవులకు రాజీనామా చేశారు. అదేసమయంలో సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అత్యంత విశ్వాస రహితుడని మదన్ లాల్ పేర్కొన్నారు.
ఇదంతా బీజేపీ ఆడిస్తున్న మైండ్ గేమ్ అని ఆప్ నేతలు ఎదురు దాడి చేశారు. యమునా నదిని కలుషితం చేసిన వారు.. ఇప్పుడు ప్రజల మనసులను కలుషితం చేసేందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై బీజేపీ మౌనంగా ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో వీరెవరికీ కేజ్రీవాల్ టికెట్లు ఇవ్వలేదు. ఇదే క్రమంలో వీరి తదుపరి చర్యలపై కూడా ఆసక్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరినట్లు ప్రకటన చేయలేదు. అయితే సామాజిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.