వైసీపీ అధినేత జగన్,  జనసేన అధ్యక్షుడు పవన్ ల మీద వైసీపీ సీనియర్ నేత,  మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేశారు.  ఇద్దరి మధ్య పోలికలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో ఇద్దరూ క్రౌడ్ పుల్లర్స్ అని తేల్చేశారు.  జగన్ కి వచ్చే జనమంతా రాజకీయాల్లో ఆయన నాయకత్వాన్ని చూసి వస్తారని, పవన్ అయితే ఆయన సినిమాలు చూసి ఆదరించి వస్తారని తేడా చెప్పారు.  పది నిమిషాల్లో పది వేల మంది జనాలకు పోగు చేసే సత్తా మాత్రం ఇద్దరికే ఉందని అన్నారు.


పవన్ 21 సీట్లు గెలిచినా సరైన రాజకీయ విధానం లేదు. సినిమాల్లో మంచి చేసిన వారిని హీరోలుగా కీర్తిస్తారు కానీ అక్కడ వారు పోషించేది క్యారెక్టర్ మాత్రమే అని నిజ జీవితంలో ఎవరు సమాజానికి మంచి చేసారో జనాలు ఆలోచించుకోవాలని కేతిరెడ్డి సూచించారు.  ఉత్తరాదిన జనాలకు ఆ తేడా తెలుసు అని వారు దక్షిణాదిన ఉన్నంతగా సినీ అభిమానాన్ని కలిగి ఉండరని అన్నారు.  దక్షిణాదిన దేవుడి కంటే తమ సొంత అమ్మా నాన్నల కంటే కూడా ఎక్కువ ఆరాధిస్తారని చెప్పుకొచ్చారు.


వైసీపీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ మౌలిక సదుపాయాలను కల్పించి విద్యా రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిన జగన్ ని ఓడించారని.. మంచి మద్యం ఇస్తామంటే కూటమిని గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.   సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నది జనాలు గ్రహించకపోవడం బాధాకరం అన్నారు.


కమలహాసన్ కంటే గొప్ప నటులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.  నటనలో ఆయన తర్వాతే ఎవరైనా అని అన్నారు.  కానీ ఆయన కూడా ఓటమి పాలు అయ్యారని, చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడించారని, ఇక హిందూపురం దాటి వెళ్ళి గుడివాడలో పోటీ చేస్తే బాలక్రిష్ణ కూడా మూడు సార్లు గెలిచేవారు కాదని కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూస్తే కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: