తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరంతా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే సమావేశం జరిపి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలాడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఉలిక్కిపడింది.
ఇప్పుడిప్పుడే పాలనపై రేవంత్ రెడ్డి పట్టు సాధిస్తున్నారు. పథకాలను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నాలుగు పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పది మంది ఎమ్మెల్యేలు ప్రైవేట్ గా సమావేశం అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ.. ఈ పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. తమ నియోజకవర్గాలలో పనులు కాకపోవడంతో ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా పరిశీలిస్తున్నది. ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణాలు ఏంటి? పనులు జరగడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది? వంటి విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అయితే ఎమ్మెల్యేలు భేటీ కావడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పు పట్టకపోగా.. ఈ మాత్రం స్వేచ్ఛ తమ పార్టీలో ఎమ్మెల్యేలకు ఉందని.. తమపై విమర్శలు చేసే నాయకుల పార్టీలో ఇలా ఉంటుందా అని రివర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆ ఎమ్మెల్యేలు మెత్తబడ్డారని.. చర్చల తర్వాత సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించారని అంటున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీ కొనసాగించారు. అయితే ఈ మీటింగ్ కు రావొద్దని అధికారులకు సూచించారు. మరి తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.