ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్ అంటే.. కేవలం కేటాయింపులు, ఖర్చులకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ, తాజాగా ప్రవేశ పెట్టిన దానిలో విస్తృత ప్రాతిపదికన నిర్ణయాలు, చర్యలు ఉంటాయన్న భావనకు పునాదులు వేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా కూడా బడ్జెట్‌లో చర్యలు ఉన్నాయి. నిరుద్యోగం అంటే.. ఒకప్పుడు.. ఉద్యోగం లేకపోవడం. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా.. పనిలేని వారంతా నిరుద్యోగులుగానే పరిగణిస్తున్న పరిస్థితి ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని.. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చారు. తద్వారా.. వ్యక్తిగా కంటే శక్తిగా ఎదిగేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. తద్వారా.. ఒక వ్యక్తి పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా.. ఆ వ్యక్తితో పాటు.. మరో నలుగురికి ఉపాధి చూపించేందుకు ఈ బడ్జెట్ ప్రాతిపదికగా నిలుస్తోంది. ఇక, రైతులకు, పేదలకు రుణాలు, ఇళ్లు ఇవ్వడం ద్వారా.. మరింత ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కేవలం ఓ వర్గానికి కేటాయింపులు పరిమితం చేయడం ద్వారా చేతులు దులుపుకొనే ప్రయత్నం అయితే లేదనే అంటున్నారు నిపుణులు.
మొత్తంగా చూస్తే.. దేశాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని తొలిసారి కేంద్ర బడ్జెట్ తీసుకురావడం 75 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు. అలాగే మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. పన్ను సరళీ కరణ ద్వారా.. ఉద్యోగులకు సంతోషాన్ని పంచారు. ఇలా.. మొత్తంగా చూసినప్పుడు.. కేంద్ర బడ్జెట్ ఒక్కొక్కరిగా కాకుండా.. సమూహాలకు లబ్ధిని ఇచ్చిందనే చెప్పాలి. అయితే.. ఇది రాష్ట్రాల పరంగా చూసుకుంటే.. కొంత అసంతృప్తిని కలిగించే విషయం వాస్తవం. అయినప్పటికీ.. దేశ ప్రజలను పరిగణనలోకి తీసుకుంటే మేలైన, మేలిమి బడ్జెట్‌గానే చెప్పాలి.