ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పన్నుల బకాయిలు వసూలు చేస్తోంది. దీనికి సంబంధించి.. సదరు శాఖను చూసే మంత్రి అన్ని జిల్లాల అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ పన్నులు బకాయిలు పెట్టకుండా చూడాలని.. బకాయిలు ఉన్నవాటిని తక్షణమే వసూలు చేయాలని కూడా ఆదేశించారు. దీంతో పన్నుల వసూళ్లు కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీనిపై కూటమి మంత్రులు ఎమ్మెల్యేలకు.. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పన్నులు ఒకేసారి కట్టలేమని.. ఇలా ఒత్తిడి చేయడం సరికాదని కూడా విన్నవిస్తున్నారు.
అయితే.. సర్కారు ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్న.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు నచ్చ జెపుతున్నారు. కానీ, నెల్లూరులోని ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాత్రం.. దీనికి కారణం. సదరు మంత్రేనంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం ప్రజలు అల్లాడి పోతున్నారని చెప్పారు. రోజూ వందల సంఖ్యలో ప్రజలు తన ఇంటికి వస్తున్నారని.. వారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నానన్నారు. సదరు మంత్రి కారణంగా రాష్ట్రంలో పన్నుల వసూళ్లు జరుగుతున్నాయన్నారు.
దీనిపై మంత్రి కూడా ఘాటుగానే స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి.. సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. పన్నులు వసులు చేయకుండా ప్రభుత్వాన్ని ఎవరైనా నడపగలరా? అంటూ.. నిలదీశారు. అయితే ఎమ్మెల్యే కొంత సైలెంట్‌గా అంటే.. మంత్రి మాత్రం సీరియస్‌గానే బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ఈవిషయం రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చింది. మంత్రి వర్సెస్ సీనియర్ ఎమ్మెల్యే మధ్య వివాదం పెరుగుతున్నట్టు గుర్తించిన పార్టీ.. ఇద్దరినీ సైలెంట్ కావాలంటూ.. తాజాగా ఆదేశించింది. కాగా.. సదరు ఎమ్మెల్యే మంత్రి వర్గంలో చోటు ఆశించిన వ్యక్తి కావడం గమనార్హం. అయితే.. ఆయనకు మంత్రి పీఠం దక్కక పోవడంతోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.