గ్రామస్థాయిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీసీ కులగణన నివేదికను కమిటీ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 42 శాతం మంది బీసీలు ఉన్నట్లు తెలిసింది. దీంతో కొత్త రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరి 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఎన్నికలు వస్తున్నాయ్.. జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచించారు. దీంతో పంచాయతీ ఎన్నికలపై ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కులగణనపై ప్రభుత్వం తీసుకున్న చర్చలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. కుల గణన నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశంపై కూడా చర్చించారు. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు తెలిసింది.
కులగణన అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఫిబ్రవరి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా.. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి తొలి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పంచాయతీ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. మెజార్టీ పంచాయతీలను దక్కించుకోవాలని ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. తెలంగాణలో అత్యధిక పంచాయతీలను గెలుచుకుంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.