తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది.  మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. అయితే ఓ విషయంలో తమతో కలిసి రావాలని బీఆర్ఎస్ ను అధికార కాంగ్రెస్ కోరుతోంది.  వినడానికి ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఆరోపిస్తున్నాయి. 


 ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక పిలుపునిచ్చారు.  కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణకు నిధుల కోసం యుద్ధం చేయక తప్పదని అన్నారు.  కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ..  సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతోందని.. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్షచూపుతోందని ఆరోపించారు.  కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతోందన్నారు. జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా 5 శాతం ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి ఎప్పుడూ మొండిచేయే చూపిస్తున్నారని మండిపడ్డారు.


అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కీలక పిలుపునిచ్చారు.  కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ నేతలు కలిసి రావాలని కోరారు.  తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని మండిపడ్డారు. ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్‌లా ఉందన్నారు. ఎన్నికల కోసమే బీహార్‌కు నజరానాలు ఇచ్చారన్నారు.    


మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కేంద్ర బడ్జెట్ పై పెదవి విరుస్తున్నారు. 16 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తీసుకురాలేదని ఇరు పార్టీలను విమర్శించారు. దీనిపై హరీశ్ రావు, కేటీఆర్ లు వేర్వేరుగా స్పందించారు.  తెలంగాణకు ఒక్కపైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదన్నారు.  మరి మహేశ్‌ కుమార్ పిలుపు మేరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి పోరాడుతుందా అంటే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: