ఈసారి కేంద్ర బడ్జెట్ ఎవరి అంచనాలకు అందకుండా ఉంది.  ముఖ్యంగా మధ్య తరగతి వారికి ప్రయోజనాలు కల్పిస్తూ మోదీ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలకు పెంచడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక ప్రేమ చూపించారు.  ఆ రాష్ట్రానికి భారీగా వరాలు ప్రకటించారు.  ఈ సమయంలో ఏపీకి చేసిన కేటాయింపులపై చర్చ ప్రారంభమైంది.


ప్రస్తుతం బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ, జేడీయూ ఉమ్మడి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. బీహార్ లోని మఖాన బోర్డు ఏర్పాటుతో పాటు ఐఐటీ విస్తరణ పై నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు. అక్కడి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పైన బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు.  


ఏపీకి సంబంధించి పోలవరం విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించారు.  ప్రస్తుత బడ్జెట్లో రూ. 5936 కోట్లను కేటాయించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్లో వెల్లడించారు. పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ. 12157 కోట్లను బడ్జెట్లో పేర్కొన్నారు.  రూ. 30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు.  41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.  ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీకి అధికంగా కేటాయింపులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.  



ఏపీ కంటే బీహార్ కు ఎక్కువ ప్రాధాన్యం తగ్గడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.  ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో అటు జేడీయూ, ఇటు టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాల్లో ఏ ఒక్కరి మద్దతు లేకున్నా కేంద్ర ప్రభుత్వానికి ముప్పు తప్పదు. అయినా మోదీ బిహార్ కే ఎక్కువగా కేటాయింపులు జరపడం పట్ల పలువురు ప్రశ్నిస్తున్నారు.  ఏపీలో విపక్షాలకు అస్త్రంగా మారుతుంది.  ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ పక్ష ఎంపీలు ఉన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యం దక్కుతోందని తరచు మాట్లాడుతుంటారు.  ఇటువంటి తరుణంలో ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తుండడం.. కచ్చితంగా విపక్షాలకు ఆయుధంగా మారుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: