ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరచేతిలోనే ప్రజలకు సేవలు అందిస్తోంది. తమకు కావాల్సిన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లు , ఇతర పౌర సేవలను వాట్సప్ లో పొందే అవకాశాన్ని కల్పించింది. వాట్సాప్ గవర్నె న్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది కూటమి సర్కారు.
వాట్సప్ గవర్నెన్స్ ను రెండు రోజుల క్రితం నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ వాట్సాప్ పాలన పూర్తిగా మంత్రి నారా లోకేష్ వ్యూహం, ఆలోచన మేరకు తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబరు తీసుకువచ్చారు. దీని ద్వారా ఏకంగా తొలిదశలో 161 సేవలను పొందవచ్చని సూచించారు. వీటిలో ప్రధానంగా ఆలయాల దర్శనాలు, సేవలకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.
గడిచిన రెండు రోజుల్లో ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రజలు విరివిగానే వాట్సాప్ పాలనను విని యోగించుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సుమారు 2 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ టికెట్లు, దేవాలయాల టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇక, పౌర సేవలకు సంబంధించి బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆశించిన విధంగా సాగలేదు. ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొందని తెలుస్తోంది.
ఇక, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యా సంబంధమైన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అంశం కూడా.. ప్రచారానికి నోచుకోవాల్సి ఉంది. వాట్సాప్ పాలనలో విస్తృతమైన.. వివరాలు నమోదు చేయాల్సి రావడం కొంత చిక్కుగా ఉండడంతో సమయం తినేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. సులువుగా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వాట్సాప్ పాలనపై సంతృప్తి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. మరింత సక్సెస్ అయ్యేందుకు కనీసం 15 నుంచి నెల రోజుల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు.