అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. జన్మతః పౌరసత్వం రద్దు చేశారు. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం చేశారు. అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను ఎనిమిది నెలల జీతం తీసుకుని వెళ్లిపోవాలని సూచించారు.  ఒక్క కలం పోటుతో మెక్సికో, కెనడా, చైనాపై సుంకాలు విధించారు.



కాకపోతే ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.  అయినా తట్టుకొని నిలబడలని ట్రంప్ వారికి పిలుపునిస్తున్నారు.  తాజాగా కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే ట్రంప్‌ నిర్ణయంపై ఆ దేశాలు మండిపడుతున్నాయి.  


ఈ క్రమంలో అమెరికాపై ప్రతీకారానికి కెనడా, మెక్సికో రెడీ అయ్యాయి.  ట్రంప్‌ నిర్ణయాన్ని డబ్ల్యూటీవోలో సవాల్‌ చేస్తామని చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెనడియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.  ఈ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్‌ అనుకుంటే మాతో భాగస్వామ్యం కోరుకోవాలని సూచించారు.  అదే వారికి మంచిదని తెలిపారు.


ట్రంప్‌ చర్యలపై చైనా మండిపడింది.  చైనా వాణిజ్య మంత్రి స్పందిస్తూ చైనా ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్‌ చేస్తామని తెలిపారు. సుంకాల పెంపుతో అమెరికా సమస్యలు తీరకపోగా, ఆర్థిక, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.


ఈ క్రమంలో ఆయా దేశాలు ప్రతీకార చర్యలతో పాటు ట్రంప్ వైఖరి వల్ల అమెరికన్లు పెనుభారం మోయాల్సి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా అమెరికన్లను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయక తప్పదు. అయినా తప్పక ప్రతిఫలం లభిస్తుంది. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాను అని కామెంట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: